మా’ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు. ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్న చిరు, భవిష్యత్ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు.
మా’ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ నటులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. తాజాగా అగ్ర కథానాయకులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు సుమ, శ్రీకాంత్, నరేశ్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర్, రాఘవ తదితరులు ఓటు వేసిన వాళ్లలో ఉన్నారు.
తాజా ఎన్నికల్లో ఉదయం 9 గంటల సమయానికే దాదాపు 30 శాతం మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి 500లకు పైగా మా సభ్యులు ఓటు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో పోలింగ్ మొదలైంది. ‘మా’లో మొత్తం 925మంది సభ్యులు ఉండగా, 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500లకు పైగా ‘మా’ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.