విష్ణు ప్రమాణస్వీకారానికి దూరంగా ప్రకాష్ రాజ్, చిరంజీవి..కారణం ఏంటో?

Prakash Raj, Chiranjeevi away from swearing in Vishnu..what is the reason?

0
91

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌పై ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఆయన శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో, ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది.

ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘మా’ ఎన్నికలు తెరపైకి వచ్చిన నాటి నుంచి మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్స్ మధ్య మాటల దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల విష్ణు ప్యానెల్‌ సభ్యులతో కలిసి పని చేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్‌, అతని ప్యానెల్‌ సభ్యులెవరూ హాజరు కాలేదు.

మరోవైపు, ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని సైతం కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమంలో చిరంజీవి కానీ..ఆయన కుటుంబానికి చెందిన హీరోలు కానీ కనిపించకపోవడం గమనార్హం.