Yakkali Ravindra Babu |టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించగా.. తాజాగా నిర్మాత యక్కలి రవీంద్రబాబు(55) మృతిచెందారు. శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మించిన రవీంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిరీత్యా చార్టెడ్ ఇంజనీర్ అయిన రవీంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించార. సినిమాలపై ఇష్టంతో నిర్మాతగా పరిశ్రమలో అడుగు పెట్టారు.
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు నిర్మించారు. నిర్మాతగా 17కు పైగా సినిమాలు తీశారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రవీంద్ర బాబు(Yakkali Ravindra Babu) ఎక్కువ సినిమాలు చేశారు. విమర్శకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకున్న ‘సొంత ఊరు’, ‘గంగ పుత్రులు’ వంటి చిత్రాలను ఈయనే నిర్మించారు. ఇక’ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘రొమాంటిక్ క్రిమినల్స్’ చిత్రాలు ఆయనకు కమర్షియల్ సక్సెస్ కూడా అందించాయి. ‘గల్ఫ్’, ‘వలస’, ‘వెల్ కమ్ టు తీహార్ కాలేజ్’వంటి సినిమాలను నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు దక్కించుకున్నారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.