‘ఆర్ఆర్ఆర్’ చిట్‌చాట్‌..ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాభట్‌

'RRR' chit chat .. Rajamouli, Ramcharan, Tarak, Alia Bhatt say interesting things

0
104

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాభట్‌, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

రాజమౌళి: ప్రెస్‌మీట్ కు ముందు ఆలియా భట్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. ఈరోజు ఆమెకు వేరే ప్రాంతంలో షూట్‌ ఉంది. ప్రెస్‌మీట్‌ కోసమే ఇక్కడికి వచ్చింది.

తారక్‌-చరణ్‌లను మొదటిసారి ఒకే ఫ్రేమ్‌లో చూసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది?

రాజమౌళి: తారక్‌-చరణ్‌లిద్దరూ ఒకే బైక్‌పై వస్తోన్న షాట్‌ని మొదట షూట్‌ చేశాను. వాళ్ల మాటలు, ప్రవర్తన చూసిన వెంటనే నేను ఫిక్స్‌ అయ్యాను. తప్పకుండా ఈ పెయిర్‌ ఆన్‌స్క్రీన్‌లో వర్కౌట్‌ అవుతుందని.

కరోనా సమయంలోనూ షూట్‌కి వెళ్లారు కదా. మీ ఫీలింగ్‌ ఏమిటి?

ఆలియా: ట్రైలర్‌ అదిరిపోయింది కదా. ముంబయిలో మాకు పిచ్చెక్కిస్తోంది. రాజమౌళి సినిమాలో నటించడం నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల నెరవేరడంతో కరోనా సమయంలోనూ షూటింగ్‌కు వెళ్లాను.

రామ్‌చరణ్‌: కరోనాకు ముందు ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కరోనా సమయంలో ఒకరకంగా డీలా పడ్డాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మేము మరింత జోష్‌తో లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి సెట్‌లోకి వచ్చాం.

తారక్‌: ప్రతి జీవికి ఓ ఆశ ఉంటుంది. అదే అతడిని నడిపిస్తోంది. అదే మాదిరిగా రాజమౌళి కన్న కలని సాకారం చేయడంలో మేము భాగం కావాలనే జోష్‌తోనే వర్క్‌ చేశాం.

రాజమౌళి: కరోనా మనకి ఒక్కరికే కాదు.. ప్రపంచం మొత్తానికి వచ్చిన ప్రమాదం. ప్రాణనష్టం వల్ల ఎంతో భయపడ్డాను. ‘ఇప్పటివరకూ పరిగెత్తింది చాలు.. కాస్త నెమ్మదించు’ అని ప్రకృతి మనందరికీ చెప్పినట్లు ఉంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా వల్ల మీరు మానసిక సంఘర్షణకు గురయ్యారా?

రాజమౌళి: కరోనాతో జరిగిన ప్రాణనష్టం వల్ల బాధపడ్డా. కానీ కరోనా సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్‌ చేశా. ఏవైనా ఇబ్బందులు వచ్చి మన ఒక్క సినిమానే ఆగిపోతే భయపడతాం. కానీ అన్ని సినిమాలు ఆగిపోయాయి. ప్రపంచం ఆగిపోయింది. ఇది ఒక్క పాజ్‌ మాత్రమే.. స్టాప్‌ కాదు.

‘యుద్ధం మొదలైతే ఆయుధాలు దానంతటవే వస్తాయన్నారు’. మరి, ఈసినిమాలో చరణ్‌-తారక్‌ వంటి ఆయుధాలను ఉపయోగించారు. ప్రేక్షకుల్ని ఎలా మెప్పించనున్నారు?

రాజమౌళి: ట్రైలర్‌లో సినిమా మొత్తాన్ని చూపించలేం కదా. సినిమాలో ఇంకా చాలా ఆయుధాలుంటాయి.

టైగర్‌ని నిజంగానే భయపెట్టారా?

తారక్‌: ఆ సీన్‌లో కనిపించని పులి మా జక్కన్న. పరిచయస్థుడైన పులి కాబట్టే నేను కూడా ఒక అరుపు అరిచాను.

కొమురంభీమ్‌ కోసం మీరు ఏవిధంగా శ్రమించారు?

తారక్‌: ఆయన పాత్రలోకి లీనం కావడం కోసం ఎంతో శ్రమించాను. స్వతహాగా మనం తెలుగువారం కాబట్టి కొమురంభీమ్‌ గురించి కొంతవరకూ తెలుస్తుంది. కానీ.. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ప్రవర్తన ఎలా ఉంటుంది? మెంటల్‌, ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక పూర్తిస్థాయి విజన్‌ ఉంది.

రాజమౌళి: చరణ్‌-తారక్‌ సెట్‌లో ఎలా ఉంటారో చెప్పు?

ఆలియా: నా ఫస్ట్ డే షూట్‌ తారక్‌తో జరిగింది. తారక్‌ నన్ను చూసిన వెంటనే.. ‘‘కాస్త టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చరణ్‌తోనే స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నా. నా పక్కన హీరోయిన్‌ లేదు’’ అని చెప్పారు. ఆ తర్వాత రోజు చరణ్‌తో షూట్‌.. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ, వాళ్లిద్దరూ ఒక చోట కలిస్తే పక్కన ఎవరు ఉన్నారనేది పట్టించుకోరు. తారక్‌.. చరణ్‌ని సరదాగా ఆటపట్టిస్తుంటారు.

మీకు తెలుగు ఎవరు నేర్పించారు?

ఆలియా: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓకే చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు అక్షయ్‌ అనే వ్యక్తి దగ్గర తెలుగులో ట్రైనింగ్‌ తీసుకున్నా. ఒక ఏడాదంతా జూమ్‌ కాల్‌లోనే తెలుగు నేర్చుకున్నా.

ఆలియాని మొదటిసారి సెట్‌లో చూశాక మీ ఫీలింగ్‌ ఏంటి?

రామ్‌చరణ్‌: తారక్‌ చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్‌డే షూట్‌ అతనితోనే

తారక్‌: నీకు జంట కదా. కాబట్టి నువ్వు చెబితేనే బాగుంటుంది

రామ్‌చరణ్‌: తారక్‌ కంగారు పడ్డాడు. చాలా రోజుల తర్వాత హీరోయిన్‌తో వర్క్‌ చేస్తున్నందుకు. నేను అల్లూరి సీతారామరాజుగా ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయాను. కాబట్టి ఆమెతో ఎక్కువ సరదాగా మాట్లాడలేదు. ఆలియా మంచి నటి అని అందరికీ తెలుసు. ఆమె స్థాయికి సరిపోయేలా నటించాలని అనుకున్నా.

తారక్‌: నేను ఎంతో ఇబ్బందిపడ్డాను. ఆమె నటనకు నేను సెట్‌ కాగలనా? అని కంగారుపడ్డా.

ఆలియా: వాళ్లిద్దరికీ నేను బిర్యానీ ఇప్పించాను. అందుకే ఇద్దరూ నా గురించి చక్కగా మాట్లాడతారు.

సీన్స్‌ని తీర్చిదిద్దే సమయంలో మీ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది?

రాజమౌళి: సీన్స్‌ విషయంలో నాకు ఎన్నో ఎలివేషన్స్‌ ఉంటాయి. మైండ్‌లో ఎప్పుడూ అవి రన్‌ అవుతూనే ఉంటాయి. మనసులో అనుకున్న దాన్ని స్క్రీన్‌పై తీసుకురావడానికి ఎంతో భయపడతాను. నా నటీనటుల్ని, టెక్నిషియన్స్‌ని టార్చర్‌ పెడతాను. కథకు తగ్గట్టు మంచి నటీనటులు దొరకడం నా అదృష్టం.

మీ సినిమాల విషయంలో పుస్తకాలు ఎలా ఉపయోగపడ్డాయి?

రాజమౌళి: అమరచిత్ర కథలు చిన్నప్పుడు బాగా చదివాను. యండమూరి, యద్ధనపూడి సులోచనా రాణి పుస్తకాలు, వారపత్రికలు.. ఇలా చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. అవే నా సృజనకి కారణం.

ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే మీరు రెండు విభిన్నమైన పాత్రలు పోషించినట్లు కనిపిస్తుంది?

రామ్‌చరణ్‌: ఇందులో నేను మొత్తం మూడు షేడ్స్‌లో కనిపిస్తాను. మూడూ విభిన్నంగానే ఉంటాయి.

ఈ సినిమాలో పునర్జన్మల ప్రస్తావన ఉంటుందా?

రాజమౌళి: లేవు

కొమురంభీమ్‌ కథ కోసం ఆయన నివసించిన ప్రాంతానికి వెళ్లారా? వాళ్ల కుటుంబీకులను కలిశారా?

రాజమౌళి: నేను ఆయన బయోపిక్ చేస్తే తప్పకుండా కథ గురించి తెలుసుకోవడానికి మీరు చెప్పిన ప్రాంతానికి వెళ్లాలి. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ యాంగిల్స్‌ ఏమీ టచ్‌ చేయడం లేదు. ఇందులో 95 శాతం సినిమా దిల్లీ చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో గోండు సామ్రాజ్యం ఉండేది. నిజాం పరిపాలన వల్ల వాళ్ల వర్గం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి వర్గానికి చెందిన ఓ వ్యక్తి నగరానికి వస్తే.. అనే ఆలోచన ఈ సినిమాలో చూపించాను. అదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు ఒక జన ప్రపంచంలోకి వస్తే.. ఆయన ఎలా ప్రవర్తిస్తాడు. దానిపై వర్క్‌ చేశాం. వ్యక్తిత్వాల మీద, పాత్రలు మీద మాత్రమే ఈ సినిమాని చూపించాం.

హీరోలిద్దరికీ బ్యాలెన్స్‌ చేసి చూపించకపోతే ఫ్యాన్స్‌ నుంచి విమర్శలు వస్తాయి?

రాజమౌళి: సినిమా ప్రారంభమయ్యాక.. తారక్‌-చరణ్‌ని చూసి ఫ్యాన్స్‌ ఇలాంటి చాలా విషయాలు మర్చిపోతారు.

ఇది దేశభక్తి చిత్రమా?

రాజమౌళి: ఇది దేశభక్తి సినిమా కాదు. ఇది ఒక ఫ్రెండ్‌షిప్‌ మీద తీసిన సినిమా. కాకపోతే అంతర్లీనంగా దేశభక్తి కూడా ఉంటుంది.

టైటిల్‌ పోస్టర్‌లో రామ్‌చరణ్‌ ముందు తారక్‌ తర్వాత ఉంటారు? దాని ఉద్దేశం ఏంటి?

రాజమౌళి: మేము అంతలా ఆలోచించి పెట్టలేదు. నిజం చెప్పాలంటే చెర్రీ కంటే తారకే ఒక ఏడాది పెద్ద

కథ ఎలా మొదలైంది?

రాజమౌళి: ఓ రోజు తారక్‌, చరణ్‌కి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నాను. ముందు తారక్‌ వచ్చాడు. సోఫాలో కూర్చొని నాతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి చరణ్‌ వచ్చాడు. తారక్‌ని చూసి చరణ్‌ షాకయ్యాడు. చరణ్‌ను చూసి తారక్‌ కూడా అంతే. ఏంటి జక్కన్న ఇద్దర్నీ పిలిచావు అని ఇద్దరూ అడిగారు. మీ ఇద్దరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నా.. అని చెప్పడంతో వాళ్లిద్దరూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నేను మర్చిపోలేను. కానీ, వాళ్లిద్దరూ ఫుల్‌ హ్యాపీ. అప్పుడే మీకు ఫస్ట్‌ మా ముగ్గురి ఫొటో షేర్‌ చేశాం.

అల్లూరి, కొమురం భీమ్‌ పాత్రలపై ఏమైనా పరిమితులు పెట్టుకున్నారా?

రాజమౌళి: రెండు ఆటంబాంబులు నాకు దొరికినట్లు ఫీల్‌ అయ్యా. అల్లూరి, కొమురం పేర్లతో ఉన్న ఇద్దరు హీరోలు ‘నాటు నాటు’ సాంగ్‌కి స్టెప్పులేయడం ఏంటి? అనే కామెంట్లు వస్తాయని ముందే ఊహించాం. ఆ పాటలో కూడా ఒక ఎమోషన్‌ ఉంటుంది. అది మీరు సినిమాలో చూస్తారు. దానికి కూడా మీరు కనెక్ట్‌ అవుతారు.

ఇందులో రొమాన్స్ చూపించడానికి ఆస్కారం ఉంటుందా?

రాజమౌళి: రొమాన్స్ కాదు బ్రొమాన్స్‌ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఫీల్‌ అవుతారు.

ట్రైలర్‌ ముందు రిలీజ్‌ చేయడానికి కారణం?

రాజమౌళి: యూట్యూబ్‌లో ట్రైలర్‌ సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేయాలనుకున్నాం. కాకపోతే ట్రైలర్‌ థియేటర్‌లో రిలీజ్‌ అయ్యాక.. దాన్ని అభిమానులు షూట్‌ చేసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడం చూశాక.. భయపడి 11 గంటలకే రిలీజ్‌ చేశాం.