Samantha PR Team gives clarity on her acting career: అక్కినేని నాగచైతన్యతో విడాకుల విషయం బయటకు వచ్చినప్పటి నుండి ఏదొక రూపంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రతిరోజూ వార్తల్లో ఉంటున్నారు. ఆమె చుట్టూ రకరకాల రూమర్లు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవలె సమంతకి మయోసైటిస్ వ్యాధి సోకిన విషయం తానే స్వయంగా వెల్లడించింది. యశోద సినిమా ప్రమోషన్లలో కూడా మరోసారి తన హెల్త్ కండిషన్ రివీల్ చేసి అందరికీ కంటనీరు తెప్పించేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె సినిమాలకు దూరమవనున్నారనే వార్త ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ వార్తలపై తాజాగా ఆమె పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
సమంత అనారోగ్యం కారణంగా ఖుషీ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆమె సైన్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఆమెకి ఉన్న వ్యాధి కారణంగా బాలీవుడ్ సినిమాల నుండి తొలగించారని, సినిమా ఆఫర్లు కూడా వెనక్కి వెళ్లిపోయానని, ఇకమీదట సమంత సినిమాలు చేయలేదని, సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ న్యూస్ విన్న ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించింది ఆమె పీఆర్ టీమ్.
సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆమె రెస్ట్ తీసుకుంటున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుని షూటింగ్స్ లో పాల్గొంటారని స్పష్టతనిచ్చారు. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతుందని, అనంతరం తాను ఒప్పుకున్న హిందీ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ‘సినిమా షూటింగ్ కోసం దర్శకనిర్మాతలను వేయిట్ చేయించడం పద్ధతి కాదు. ఒకవేళ సామ్‌కు షూటింగ్‌లో పాల్గొనడం సాధ్యం కాకపోతే.. వారి షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ పూర్తి చేసుకోమని ముందే స్పష్టం చేశాం. ఇప్పటి వరకు సమంత ఒప్పుకున్న ఏ ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదు. కొత్త సినిమాలు ఏవీ కూడా ఒప్పుకోలేదు. సమంత నెక్స్ట్ మూవీస్ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని సమంత పీఆర్ టీమ్ రూమర్స్ కి చెక్ పెట్టింది.