ప్రముఖ గాయని కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారు అనేది ఇంకా తెలియలేదు. కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. రెండు రోజులుగా వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది.. అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అలెర్ట్ అయిన అసోసియేషన్.. ఆమెతో మాట్లాడటానికి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. ఈ విషయాన్ని భర్తకు తెలియజేశారు.
ఈ క్రమంలో కల్పనతో(Singer Kalpana) మాట్లాడటానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో అసోసియేషన్ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు.. కల్పన ఫ్లాట్ తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. కాగా అక్కడ కల్పన స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, బుధవారం ఆమె ఆరోగ్యంపై స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు పలువురు గాయనీగాయకులు ఆసుపత్రికి వచ్చి కల్పన పరిస్థితి గురించి తెలుసుకుని వెళ్లారు.