ఫలించిన ప్రేమల కంటే విఫలమై పోయిన విషాద ప్రేమ కథలే నేటికీ చరిత్రలో సజీవంగా నిలచి పోయాయి అని నిరూపిస్తూ వాటిని కళ్ళకు కట్టినట్లుగా రంగస్థలంపై ఆవిష్కరించారు డా.శ్రీజ సాదినేని.
రసరంజని సంస్థ నిర్వహించే నెలవారీ కార్యక్రమాల్లో రవీంద్ర భారతిలో బుధవారం సాయంత్రం శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన ప్రియసఖి నాటకం ప్రేక్షకులతో కంట తడి పెట్టించింది.
ప్రేమ కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ప్రేమ జంటలను సజీవంగా రంగస్థలంపై ఆవిష్కరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది.
చక్కని సంభాషణలు, దర్శకత్వ ప్రతిభ, లైటింగ్ టెక్నాలజీతో పాటు డా.శ్రీజ సాదినేని నటన వెరసి ఈ నాటకం ప్రేక్షకుల కంటికి కమ్మని విందును అందించింది.
నాటకం మొదలైన క్షణం నుండి ముగిసే వరకు ప్రేక్షకులు కంటి రెప్ప కూడా కొట్టకుండా, కుర్చీ నుండి కదలకుండా ఆద్యంతం ఆసక్తిగా తిలకించడం విశేషం.
డా.శ్రీజ సాదినేని రచించి, దర్శకత్వం వహించి, ముఖ్య భూమికను పోషించి నిర్వహించిన ఈ నాటకంలో శశిధర్ ఘణపురం, అవినాష్ యాదవ్, ఏపూరి పార్థ సారథి, మోహన ప్రియ, సింధు, శ్రీ హర్షిణి, వినోద్ కుమార్, తిరుమల రావు, జీవన్, పవన్, తేజ వర్ధన్, సింహ తేజ తదితరులు నటించి అలరించారు. లైటింగ్ సురభి ఉమా శంకర్ అందించారు.