Super satr krishna passes away due to several organs failure: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణ చేరిన విషయం విదితమే. కార్డియాక్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులపై కూడా పడటంతో, కృష్ణ ఆరోగ్యం మరింత విషమించినట్లు వైద్యులు సైతం ప్రకటించారు. వెంటిలేటర్‌పైనే చికిత్స అందించనప్పటికీ.. కృష్ణ ప్రాణాలు నిలవలేదు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ తన 79 ఏట తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. కృష్ణ మరణవార్త విన్న సినీ లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు ప్రిన్స్ మహేష్ బాబుకు పెద్ద లోటుగా కనిపిస్తోంది.
తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సాహసం చేయలన్నా, సంచలన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నా సూపర్ స్టార్ తరువాతే అన్నంతగా పేరు సాధించారు. నటుడిగా ప్రస్థానం మెుదలుపెట్టిన కృష్ణ, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమా చేశారు. ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు కృష్ణ. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగాన్ని ఏలారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమాలకు కొత్త కొత్త విషయాలు, టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణదే. తెలుగులో తొలి జేమ్మ్ బాండ్ సినిమా అయిన గూఢాచారి 116 లో నటించి, సంచలనం సృష్టించారు. కృష్ణ మరణం పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.