వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV) తెరకెక్కించిన ‘వ్యూహం(Vyooham)’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో నేడు విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాలో చంద్రబాబు(Chandrababu) ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారని సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.
మరోవైపు ‘వ్యూహం(Vyooham)’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డి. నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 139 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యూహం సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణమే సినిమా సెన్సార్(Censor) సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.