డైరెక్టర్ శంకర్ గురించి తెలీని వారుండరు.. అయన సినిమాల్లో ఎంత భారీతనం ఉంటుందో కథల్లో అంతే మెచూరిటీ కథనంలో అంతే మెచూరిటీ ఉంటుంది.. అయన సినిమా ల్లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా కథ పై మాత్రం ప్రత్యేక ద్రుష్టి పెడుతుంటారు.. అలాంటి శంకర్ కి కథల్లో అంత పట్టు ఉండదు, అయన కథల్లో విషయం లేదు, అంటూ కామెంట్స్ చేశారు తమిళ స్టార్ కమెడియన్ వడివేలు..
శంకర్ నిర్మాణంలో అతడి శిష్యుడు తీసిన ’23వ పులకేసి’ సినిమాలో వడివేలే హీరో. ఆ చిత్రం సూపర్ హిట్టయింది. ఐతే దీనికి సీక్వెల్ తీయడానికి శంకర్-శింబుదేవన్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఐతే అడ్వాన్స్ తీసుకుని షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాక వడివేలు హ్యాండిచ్చాడు. దీనిపై చాన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో శంకర్-శింబుదేవన్‌లను టార్గెట్ చేశాడు వడివేలు.
”అసలు శింబుదేవన్‌కు దర్శకత్వమే రాదు. ’23వ పులికేసి’లో సినిమా చాలా వరకు నా చేతుల మీదే నడిచింది. అందులో కొన్ని పాత్రల్ని నేనే తీర్చిదిద్దా. హాస్య సన్నివేశాలు కూడా రాశా. శింబుదేవన్ ’24వ పులికేసి’ లైన్ మాత్రమే చెప్పాడు. నేను పూర్తి స్థాయిలో చర్చించి.. అందులో త్రిపాత్రాభినయం వచ్చేలా కథ మార్చా. అంతేకాకుండా హాస్య సన్నివేశాలు కూడా చెప్పా. అప్పుడు సంపూర్ణ చిత్రంగా మారింది. దర్శకుడు శంకర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రాఫిక్ సన్నివేశాలతోనే దర్శకుడిగా నెట్టుకొస్తున్నారు. ఆయన కేవలం ఒక గ్రాఫిక్స్ డైరెక్టర్” అని వడివేలు అన్నాడు.