చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కర్ణాటకలో రెండు కేసులు, గుజరాత్ లో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి తో భారత ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా నమోదవుతున్న శ్వాస కోస వ్యాధులపై పర్యవేక్షణ చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ లోకి వైరస్ ఎంటర్ అయినట్టు గుర్తించింది.
కర్ణాటకలో రెండు HMPV కేసులను గుర్తించినట్లు ICMR సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి కేసు 3 నెలల ఆడ శిశువు బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో చేరిన తర్వాత HMPV ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే చిన్నారిని డిశ్చార్జి చేశారు. రెండవ కేసు 8 నెలల మగ శిశువుది. జనవరి 3, 2025న బ్రోంకోప్ న్యుమోనియా సమస్యతో చిన్నారిని బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత HMPVకి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడు.
ఇక మూడవ కేసుని గుజరాత్ లో గుర్తించారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌కు చెందిన రెండు నెలల చిన్నారికి చికిత్స కోసం గుజరాత్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా హెచ్‌ఎంపీవీ వైరస్ బారిన పడ్డట్టు వైద్యులు గుర్తించారు. అయితే HMPV Virus సోకిన ఈ చిన్నారులకి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం.