జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారంతా ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కాదు కూడదు పోరాటమే చేస్తామంటూ భారతదేశ భద్రతా బలగాల చేతిలో వారికి చావు తప్పదని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో నిర్వమించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉగ్రవాదులతో చర్చలు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, అయితే తాము చర్చలకు సిద్ధమని.. ఉగ్రవాదులు కూడా అదే కోరుకుంటే ఆయుధాలు వదిలి రావాలని చెప్పారు. దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల ఎన్నో కష్టాలను అనుభవించిన జమ్మూకశ్మీర్ ఇప్పుడే అభివృద్ధిని చూస్తోందన్నారు. అటువంటి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అడుగుపెట్టిన తర్వాతే అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యం బోలేపతం కావడం ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేసేవరకు బీజేపీ విశ్రమించదని, తన లక్ష్య సాధనకు అహర్నిశలు శ్రమిస్తుందని అన్నారు.
‘‘ఈశాన్య భారత్‌లో 10వేల మంది ఉగ్రవాదులు లొంగిపోయారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి రెండు దశల పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 55 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో తరహాలో ప్రతిపక్షాలు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం బలపడింది. గత 40ఏళ్లుగా ఎన్‌సీ, కాంగ్రెస్ తమ అధికారం కోసం ఉగ్రవాదానికి రక్షణ కల్పిస్తూ వచ్చాయి. కానీ బీజేపీ మాత్రం ఉగ్రవాదాన్ని అంతం చేస్తూ వస్తోంది. దేశంలోని పలు ఇతర ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో కూడా ఉగ్రవాదాన్ని కనుమరుగు చేస్తాం. జమ్మూకశ్మీర్‌కు కొత్త అభివృద్ధి మార్గాలను చూపుతాం’’ అని Amit Shah వ్యాఖ్యానించారు.