కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ రాహుల్ గాంధీ తన అహంకార ధోరణిని వదులుకోలేదని, పార్లమెంటులో ఇప్పటికీ అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శలు గుప్పించారు అమిత్ షా. ఝార్ఖండ్‌లో నిర్వహించిన బీజేపీ సమావేశంలో రాహుల్ తీరుపై షా విరుచుకుపడ్డారు.
‘‘కొందరు నాయకులకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అహంకారం పెరుగుతందని నేను విన్నాను. ఝార్ఖండ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు కూడా అలాంటి వారే. కానీ అధికారంలో లేకపోయినా అహంకారం మాత్రం పుష్కలంగా ఉన్న వ్యక్తిని నేను మొదటిసారి చూస్తున్నా. ఆయనే రాహుల్ గాంధీ(Rahul Gandhi). పార్లమెంటులో రాహుల్ గాంధీ అహంకారం కనబరిచిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిపూర్తి మెజారిటీతో విజయం సాధించింది. ఇది ఇండి కూటమికి దక్కిన స్థానాల కన్నా ఎక్కువ. అలాంటప్పుడు ఇండి కూటమి నేతలకు ఎందుకింత అహంకారం? వరుసగా మూడోసారి ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ వాస్తవాన్ని ఇండి కూటమి వారు అంగీకరించలేకున్నారు. ఇప్పటికైనా వాళ్లు వాస్తవాన్ని అంగీకరిస్తే బాగుంటుంది’’ అని షా(Amit Shah) అన్నారు.