ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel express) ఘోర ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే జరిగిన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆగివున్న గూడ్స్ రైలును పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా ఢీకొట్టి మరో ట్రాక్‌పై పడిపోయింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా యశ్వంత్ పూర్ సూపర్‌ఫాస్ట్ ట్రైన్ వచ్చి ఢీకొట్టడంతో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఊహించని రీతిలో పెను ప్రమాదం సంభవించింది.
కాగా 14 ఏళ్ల కిందట కూడా కోరమాండల్ రైలుకు(Coromandel express) ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2009లో ఫిబ్రవరి 13వ తేదీన జైపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోవడంతో 16 మంది మరణించారు. ఆ ప్రమాదం కూడా శుక్రవారం రోజు రాత్రి 7:30 నుంచి 7:40 గంటల మధ్యలోనే జరగడం విషాదకరం. దీంతో కోరమాండల్ రైలును బ్లాక్ ఫ్రైడే వెంటాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.