ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా(Richest CM) నిలిచారు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.931 కోట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తులతో రెండవ స్థానంలో నిలవగా… రూ.51 కోట్లతో మూడవ స్థానంలో కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్య ఉన్నారు. ఇక దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్ కు చెందిన మమతా బెనర్జీ(Mamata Banerjee) రూ.15 లక్షల విలువైన ఆస్తులను ప్రకటించారు. ఆమె తర్వాతి స్థానంలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల విలువైన సంపదను కలిగి ఉండగా.. కేరళకు చెందిన పినరయి విజయన్ రూ.1 కోటి విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు.
కాగా, ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) డిసెంబర్ 30న ఒక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ADR, నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) ఈ నివేదికను సిద్ధం చేయడానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 31 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించాయి. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్ల నుంచి ఈ వివరాలు సేకరించి నివేదికను విడుదల చేశారు.
సీఎంల సగటు ఆస్తులు రూ.52.59 కోట్లు
రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ.52.59 కోట్లు అని నివేదిక పేర్కొంది. భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం 2023-2024కి సుమారుగా రూ. 1,85,854 ఉండగా… ఒక సీఎం సగటు స్వీయ ఆదాయం రూ. 13,64,310. ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు ఎక్కువ అని తేలింది. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు అని నివేదిక వెల్లడించింది.
భారతదేశంలోని అత్యంత సంపన్న సీఎం(Richest CM) చంద్రబాబు నాయుడు, పేద సీఎం మమత బెనర్జీ ఆస్తుల మధ్య రూ.930 కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు తాజా నివేదికలో బయటపడింది. ఇక 13 (42 శాతం) మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించుకున్నారని.. 10 (32 శాతం) మంది హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారని కూడా నివేదిక పేర్కొంది. 31 మంది ముఖ్యమంత్రులలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన అతిషి లో దేశంలో ప్రస్తుతం ఉన్న మహిళా సీఎంలు.