లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24లోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది.
ఇక కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేస్తారని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని.. ఆయన కస్టడీని పొడిగించాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.