శతాబ్దాలుగా ఉన్న కోట్లాది మంది భారతీయుల కల జనవరి 22న అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంతో నెరవేరిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కన్నుల పండువగా జరిగింది. దీంతో తర్వాతి రోజు నుంచి సామాన్య భక్తులకు రాములోరి దర్శనం కల్పించారు. దాదాపు 5లక్షల మంది భక్తులు కోదండరాముడిని దర్శనం చేసుకున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. అలాగే భక్తులు ఇచ్చిన విరాళాల ద్వారా రూ.3.17 కోట్లు వచ్చాయని తెలిపింది. డొనేషన్ల కౌంటర్లలో కొందరు భక్తులు నేరుగా నగదు రూపంలో విరాళాలు ఇవ్వగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో డొనేట్ చేశారు.
ఇక భక్తుల తాకిడి విపరీతంగా ఉండంటంతో ఆలయాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యతను RSS తీసుకుంది. సంఘ్ వర్కర్స్ ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. అలాగే దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ మందిరం నిర్మాణానికి సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ 101 కేజీల బంగారం అంటే దాదాపు రూ.68 కోట్లు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం మిగిలిన ఆలయ నిర్మాణ పనులు కూడా చకాచకా జరుగుతున్నాయి. 2025 నాటికి ఆలయం(Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తి అవ్వనుంది.