‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నిషేధం విధించిన పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఈ నిషేధం గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని చూడటం సరికాదని, అలా అనుకుంటే సినిమాలన్నీ కోర్టులకే చేరుతాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మూవీకి సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ జారీ చేసిందని, బ్యాన్ చేయడం సరికాదని పేర్కొంది. శాంతి భద్రలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.
మరో వైపు తమిళనాడులో భద్రతా కారణాలను చూపుతూ ఎగ్జిబిటర్లు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై ప్రభుత్వమే సినీ ప్రేక్షకులకు భద్రత కల్పించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మూవీకి సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జూలై రెండో వారంలో విచారిస్తామని తెలిపింది. ఈ అంశంలో నిర్ణయం తీసుకునే ముందు చిత్రాన్ని తాము చూడాలనుకుంటున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. సూదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ(The Kerala Story) మూవీ మే 5న విడుదల కాగా ఈ సినిమాపై బెంగాల్ ప్రభుత్వం(Mamata Banerjee govt) మే 8న నిషేధం విధించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం పరోక్షంగా ఇదే నిర్ణయాన్ని అమలు చేయడంపై మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు పై నిర్ణయాన్ని ప్రకటించింది.
Read Also: వీఆర్ఏలకు తెలంగాణ సర్కార్ శుభవార్త
Follow us on: Google News, Koo, Twitter