ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు గుప్పించారు. చాలా పార్టీలు కుటుంబ రాజకీయాలకు మారుపేరుగా మారాయని ధ్వజమెత్తారు. కానీ అలాంటి సాంప్రదాయం బీజేపీలో లేదని, సామాన్య వ్యక్తి నుంచి ప్రధాని వరకు మారే అవకాశం కేవలం తమ పార్టీలోనే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నిలువెత్తి నిదర్శనమని చెప్పుకొచ్చారు. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని, అందుకే తమ పార్టీ ఎప్పుడూ వంశ రాజకీయాలను ప్రోత్సహించలేదని అన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అధ్యక్షడు సహా ప్రతి ఒక్కరికి కూడా బీజేపీలో సమాన అవకాశాలు ఉంటాయని, ఒక వర్గం వారికో లేదా ఒక కుటుంబం వారికో బీజేపీ ఏనాడూ పెద్దపీట వేయలేదని, వేయదని అన్నారు. పేదల అభివృద్ధి కోసం ఎన్‌డీఏ(NDA) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. వారి కోసం పీఎం ఆవాస్ యోజన పథకం తీసుకొచ్చిందని, దాని కింద ఎందరో పేదలకు ఇళ్లు నిర్మించిందని గుర్తు చేశారు.
‘‘ప్రస్తుతం దేశంలోని చాలా పార్టీలు వంశ రాజకీయాలకు నెలవుగా మారాయి. లేకుంటే కొన్ని వర్గాల వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ సంప్రదాయానికి బీజేపీ విరుద్ధం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులకు సైతం ప్రధానితో సమాన అవకాశం కల్పించే ఏకైక పార్టీ బీజేపీ. అందుకు ప్రధాని మోదీనే కారణం. ఇతర పార్టీల్లో అయితే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరాలంటే సదరు వ్యక్తి గొప్ప కుటుంబానికి సంబందించిన వ్యక్తి లేదా ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే వారు ఉన్నత పదవులు అందుకోగలుగుతారు’’ అని ఆరోపించారు నడ్డా(JP Nadda).