500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరీక్షణకు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో అయోధ్య(Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది. అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్ శాస్త్రి లక్ష్మీకాంత్ దీక్షితులు ఆధ్వర్యంలో రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు అయోధ్యకు తరలివచ్చారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు.. ఇలా అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. దీంతో అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది. భారీగా ప్రముఖులు అయోధ్య(Ayodhya)కు చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యూపీ పోలీసులు, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.