కేరళలో నిఫా వైరస్(Nipah Virus) కలకలం రేగింది. ఈ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు మరణించారని, మరో నలుగురు వైరస్ బారిన పడ్డారని కేరళ ప్రభుత్వం ధ్రువీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్ జిల్లాలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు ఆఫీసులకు సెలవులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దుకాణాలు కూడా మూసేశారు. నిఫా వైరస్ కలకలంతో కేరళలో లాక్ డౌన్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా? ఎందుకు ఈ వైరస్ అంటే అంతలా భయపడుతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిఫా వైరస్(Nipah Virus) ను బంగ్లాదేశ్ వేరియంట్ గా ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇది మనుషుల నుండి మనుషులకు వ్యాపిస్తుందని వెల్లడించింది. వ్యాప్తిరేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని తెలిపింది. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళకు రానున్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నాయి. పందులు, గబ్బిలాల నుంచి మనుషులకు వైరస్ సోకడంపై పరిశోధనలు చేయనున్నారు. పందులు, గబ్బిలాల నుంచి ఈ వ్యాధి మనుషులకు సోకుతుందని WHO చెప్పిన నేపథ్యంలో దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు.
కలుషిత ఆహారం, వ్యాధి సోకిన వ్యక్తుల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు కనిపించవు. మరికొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సరైన మందులు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వైరస్ సోకిన వారిలో 70 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. లక్షణాలు గుర్తించి వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కేరళలో నిఫా వైరస్ కేసులు వెలుగుచూడడం ఇది నాలుగో సారి. 2018లో కోజికోడ్ జిల్లాలో 18 నిఫా వైరస్ కేసులు వెలుగు చూస్తే అందులో 17 మంది మరణించారు. 2019లో ఎర్నాకులం జిల్లాలో ఒక నిఫా వైరస్ కేసు నమోదవగా.. బాధిత వ్యక్తి కోలుకున్నారు. 2021లో చాతమంగళం గ్రామానికి చెందిన ఒక బాలుడికి వైరస్ సోకడంతో మరణించాడు. కాగా ఈ ఏడాది కూడా కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.