బెంగాల్‌ను వరదలు బెంబేలెత్తిస్తున్నా కేంద్రం రూపాయి సాయం కూడా చేయట్లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మండిపడ్డారు. ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయినా కేంద్రం మాత్రం చూసీ చూడనట్టు ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా ఆమె కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రజలకు యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలను అందిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దని, చిట్టచివరి బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్‌ల దగ్గర బ్రిడ్జింగ్ చేయడంలో విఫలమైందని, దాని ఫలితంగానే రాష్ట్రంలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయని ఆమె ఆరోపించారు. మానవ తప్పిదం వల్ల సంభవించిన ఈ వరదలకు డీవీసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఝార్ఖండ్-బెంగాల్ సరిహద్దులో మైథాన్, పంచేత్‌ల దగ్గర డీవీసీ డ్యామ్‌లు ఉన్నాయి. వాటి నుంచి ఈ ఏడాది డీవీసీ 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడం కారణంగానే ఈ వరదలు సంభవించాయని ఆమె అన్నారు.
‘‘ఉత్తర బెంగాల్ వరదలతో అల్లాడుతోంది. కూచ్ బెహార్, జల్పాయిగుడి సహా పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోశి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల మరిన్ని జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎటువంటి సహాయం అందించడం లేదు. ఫరక్కా బ్యారేజీ నిర్వహణ చర్యలను కూడా చేపట్టట్లేదు. దాని వల్ల అందులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది’’ అని Mamata Banerjee మండిపడ్డారు.