ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం కేజ్రీవాల్(Kejriwal) ను అరెస్టు చేశారు. ఆయన నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం అధికారులు కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆప్ నేతలు, అభిమానులు సీఎం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. లోక్సభ ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ కుట్రలో భాగమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని ఆప్ మంత్రి ఒకరు స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కి సంబంధించిన మనీ లాండ్ రింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ 9 సార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ, విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించిన కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించి పలుమార్లు స్టే తెచ్చుకున్నారు. కానీ, ఈరోజు ఆయనకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో మేము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పిన గంటల వ్యవధిలోని ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. 12 మంది అధికారుల బృందం ఆయన ఇంట్లో రెండు గంటల పాటు సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ నుంచి PMLA సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు
సుప్రీం కోర్టుని ఆశ్రయించిన Kejriwal లాయర్లు..
కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసుని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది.