ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది. ఇదిలా ఉందగా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) తోటీ ఎంపీలకు ఓ పిలుపునిచ్చారు. రైలు ప్రమాద బాధిత కుటంబాలకు తమ జీతంలోని కొంత భాగాన్ని అందజేయాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకరమని.. మన జీతంలో కొంత భాగాన్ని వారికి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవాలని నా తోటి ఎంపీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు. వాళ్లకి ముందు మద్దతు ఇవ్వాలని ఆపై న్యాయం జరగాలని కోరారు.