ప్రస్తుతం షుగర్(Diabetes) వ్యాధి అనేది చాలా కామన్ అయిపోయింది. దీనిని కంట్రోల్ చేయడానికి నానాపాట్లు పడుతుంటారు బాధితులు. తాజాగా ఇదే అంశంపై కర్ణాటక(Karnataka) సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను షుగర్ బాధితుడనేనని చెప్పారు. 30 ఏళ్లుగా షుగర్ తనను బాధిస్తుందని, దానికి కంట్రోల్ చేయడానికి తానో చిన్న చిట్కా ఫాలో అవుతున్నానని కూడా చెప్పారు. దాని వల్లే ఇన్నాళ్లుగా కూడా షుగర్ తనను పెద్దగా బాధించలేదని అన్నారు. అందుకు తాను పెద్దతా చేసేదేమీ లేదని, తన జీవనశైలిలో చేసుకున్న చిన్నచిన్న మార్పులతోనే షుగర్‌ను కంట్రోల్ చేశానని అన్నారాయన. కర్ణాటకలో గృహ ఆరోగ్య పథకాన్ని(Gruha Arogya Scheme) ప్రారంభించిన సందర్బంగా ఆయన తన ఆరోగ్యంపై స్పందించారు. ప్రతి రోజూ వ్యాయామం, క్రమశిక్షణతో షుగర్‌ను కంట్రోల్ చేయడం సాధమేనని, తన మంత్రా కూడా అదేనని వివరించారు సిద్దరామయ్య.
క్రమశిక్షణ చాలా ముఖ్యం
‘‘నేను స్టంట్ వేయించుకుని 24 సంవత్సరాలవుతుంది. వైద్యుల సలహాలను పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. ముందుగా గ్రహించి చికిత్స అందిస్తే క్యాన్సర్ కూడా నయమవుతుంది. అటువంటి మధుమేహం, బిపీలను నియంత్రించలేమా. కాకపోతే షుగర్, బీపీలను నియంత్రించడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి చాలా అవసరం. ఆరోగ్య సమస్యలను దాచిపెట్టడం సరికాదు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల వాళ్లు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లలేరు. వారికి ఈ పథకం అద్భుతంగా పనిచేస్తుంది’’ అని చెప్పారు.
రోగాలకు ఒత్తిడే కారణం
అంతేకాకుండా ఒత్తిడితో కూడాని జీవితం వల్లే అనారోగ్యాలు వస్తున్నాయని, ప్రస్తుతం చాలా వరకు ఆహార పదార్థాలు రసాయనాలతోనే తయారవుతున్నాయని చెప్పారు. వీటి వినియోగం వల్లే ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నాయని అన్నారు. గుడ్లు, చేపలు, మాంసం తింటే మధుమేహం పెరుగుతుందనేది అపోహ మాత్రమేనని, సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని వివరించారు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah).