భారత వాతావరణ శాఖ(Indian Meteorology Department) ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు(Monsoons) దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. కేరళ తీరాన్ని తాకినట్లు అధికారికంగా తెలియజేసింది. అయితే తాము అంచాన వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని పేర్కొంది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. సాధారణంగా జూన్ 1వ తేదీనే రుతుపవనాలు(monsoons) కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. వాతావరణ మార్పులు కారణంగా ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయని చెప్పింది. కాగా గతేడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న తీరాన్ని తాకాయి.