ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నేటి నుంచి జూన్ 1 వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. తిరిగి జూన్ 2న కోర్టులో లొంగిపోవాలని ఉతర్త్వుల్లో పేర్కొంది. ఈలోపు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని సూచించింది.
ఈనెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాడీవేడీగా వాదనలు జరిగాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం చేసేందుకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈడీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రచారం చేసే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది.
అయితే ఇది అసాధారణ పరిస్థితి అని కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని.. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని ఓ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ఆయనకు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ కేసు(Liquor Case)లో అరెస్టైన కేజ్రీవాల్(Arvind Kejriwal) నెల రోజుల నుంచి తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.