ఝార్ఖండ్(Jharkhand) విశ్వాస పరీక్షలో సీఎం చంపై సోరెన్ నెగ్గారు. ఆయనకు మద్దతుగా 47 ఓట్లు, వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. ఉత్కంఠ గా సాగిన ఝార్ఖండ్ బలపరీక్షలో చంపై సోరెన్ ఆధిక్యం చాటుకోవడంతో JMM, మహా కూటమి విజయం సాధించింది. ఈ ఓటింగ్ లో మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా పాల్గొన్నారు. కాగా, భూ కుంభకోణంకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు.
బలపరీక్షలో పాల్గొనేందుకు నాలుగు గంటల పర్మిషన్ తో అధికారులు ఆయనని అసెంబ్లీకి తీసుకువచ్చారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ(BJP)పై విమర్శలు గుప్పించారు. తన అరెస్టులో రాజ్ భవన్ పాత్ర ఉందని హేమంత్ ఆరోపించారు. జనవరి 31వ తేదీ రాత్రి దేశంలోనే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని, ఇది దేశ చరిత్రలో మాయని అధ్యాయంగా మిగిలిపోతుందని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఝార్ఖండ్(Jharkhand)లో అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్(Champai Soren) కు తమ పూర్తి మద్దతు ఉందని తెలిపారు.