కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను ఓడించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా వరుస సమావేశాలు జరుపుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. మూడోసారి ముంబైలో మూడో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేశంలోని 13 పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil sibal) ముంబైలో జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి సమావేశంలో సడన్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి సమాచారం లేకుండా ఆయన అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు.
కొద్దికాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన పలికి, సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇండియా కూటమి సమావేశానికి ఆయనకు అధికారికంగా ఆహ్వానం లేకపోయినప్పటికీ ఆయన విచ్చేశారు. విపక్ష నేతలంతా కలిసి ఫోటో తీయించుకోవడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. సిబల్(Kapil sibal) రాకను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడంతో పలువురు జోక్యం చేసుకుని నచ్చచెప్పారు. కపిల్ రాకపై తనకెలాంటి అభ్యంతరం లేదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పినట్టు తెలుస్తోంది.