Reservation Bill | రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు 100శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రేపిన దుమారంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూసాలు కదిలిపోయాయి. వారు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుధేలు కావొచ్చని, రాష్ట్రం నుంచి బడాబడా సంస్థలు వెళ్లిపోయే ప్రమాదం ఉందని, దాని వల్ల కన్నడిగులు 100శాతం ఉద్యోగులు పొందడం కాదు.. 100శాతం నిరుద్యోగులు అవుతారంటూ పలువురు ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కూడా సూచించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు కూడా జరిగాయి. వీటి తాకిడికి ఈ రిజర్వేషన్ బిల్లులపై(Reservation Bill) ఎక్స్(ట్విట్టర్) వేదికగా పెట్టిన పోస్ట్ సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) ఆఘమేఘాలపై డిలీట్ చేశారు. ఈరోజు ఈ బిల్లుపై క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొన్ని నేపథ్యంలో దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టతనిచ్చారు.
‘‘సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రైవేటు రంగంలో కన్నడిగులకు రిజర్వేషన్లపై పూర్తి స్థాయి చర్చ జరగలేదు. పూర్తి వివరాలు మేము వెల్లడించకుండానే మీడియా కథనాలను ప్రచురించేసింది. ఈ గందరగోళానికి అదే కారణం. త్వరలో చేపట్టే సమావేశంలో ఈ అన్ని అంశాలపై చర్చించి పూర్తి వివరాలతో అందరి సందేహాలను నివృత్తి చేస్తాం’’ అని వివరించారు సీఎం సిద్దరామయ్య. ఈ బిల్లుపై క్లారిటీ ఇవ్వాలంటూ విపక్ష నేత ఆర్ అశోకా చేసిన డిమాండ్‌కు సమాధానంగా సిద్దరామయ్య ఇలా స్పందించారు.