దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు. 1954లో కేవలం జీవించి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డు అందించేవారు. అనంతరం మరణించిన వారికి కూడా పురస్కారం అందించడం మొదలైంది. ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఇస్తారు. అయితే దీనికి పరిమితులు లేవు. అలాగే ప్రతి ఏడాది ఇవ్వాలనే నిబంధన కూడా లేదు. ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారంను కేంద్రం ప్రకటించడం విశేషం. గతంలో 1999వ సంవ్సరంలో నలుగురి భారతరత్న ప్రకటించారు.
ఈ ఏడాది ముందుగా బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్(Karpoori Thakur)కు ఈ పురస్కారం ప్రకటించగా.. ఇటీవల బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి కూడా ప్రకటించారు. తాజాగా తెలుగు జాతి ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao), మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్(Charan Singh), వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan)లకు ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. వీరితో కలిపి ఈ అవార్డుకు ఎంపికైన వారు మొత్తం ఐదుగురు అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎల్‌కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.
భారతరత్న(Bharat Ratna) అవార్డు కోసం వ్యక్తులను ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. అనంతరం రాష్ట్రపతి ఆ పేర్లను ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, ఓ మెడల్‌ను భారతరత్న గ్రహీతలకు అందజేస్తారు. ఈ మెడల్ రావి ఆకు రూపంలో ఉండి మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ ఉంటుంది. దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనకవైపు భారత జాతీయ చిహ్నం, సత్యమేవ జయతే అని ఉంటుంది.