శివసేన ఎమ్మెల్యే పై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపిన ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యే మహేష్ గైక్వాడ్ పై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్(Ganpat Gaikwad) కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి హత్యాయత్నం కేసును నమోదు చేశారు. ఓ భూవివాదం కారణంగా పోలీస్ స్టేషన్ లోని మహేష్ గైక్వాడ్ పై గణపతి గైక్వాడ్ కాల్పులు జరిపారు. దీంతో వెంటనే గణపతి గైక్వాడ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మహేష్ గైక్వాడ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
చికిత్స చేసిన థానే ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు.. శివసేన(Shiv Sena) ఎమ్మెల్యేకి శస్త్ర చికిత్స జరిపామని, అయినప్పటికీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన గణపత్.. తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో దాడి జరగడం వల్లే గన్ ఫైర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సీఎం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రను నేరగాళ్ళ సామ్రాజ్యంగా మార్చాలనుకుంటున్నారని, బీజేపీ ఎమ్మెల్యే గణపత్ ఆరోపించారు. భూ వివాదానికి సంబంధించి ఆయన కుమారుడు శివసేన పార్టీ నేతల పై ఫిర్యాదు చేసేందుకు ఉల్హస్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడకు మహేష్ గైక్వాడ్, గణపత్ గైక్వాడ్ లు తమ అనుచరులతో స్టేషన్ కి చేరుకున్నారు. వాగ్వివాదం చెలరేగి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్సై గదిలోనే గణ్ పత్ గైక్వాడ్(Ganpat Gaikwad) శివసేన ఎమ్మెల్యే మహేష్ గైక్వాడ్ పై 5 రౌండ్ల కాల్పులు జరిపారు.