కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. నవంబర్ 6న విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని లోకాయుక్త తమ నోటీసుల్లో సీఎంకు హెచ్చరించింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్(MUDA) కుంభకోణం దర్యాప్తులో భాగంగానే లోకాయుక్త.. సీఎంకు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య స్వయంగా ధ్రువీకరించారు. ‘‘ముడాకు సంబంధించి మైసూరు లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చాయి. నవంబర్ 6న విచారణకు హాజరుకానున్నాను’’ అని సీఎం ప్రకటించారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 25న సీఎం సిద్ధరామయ్య సతీమణిని లోకాయుక్త ప్రశ్నించింది. ఈ సందర్భంగానే రాజకీయ విధ్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు(MUDA Scam Case)లో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరినీ లోకాయుక్త ఇప్పటికే విచారించింది. సిద్ధరామయ్య(Siddaramaiah) ఒక్కరే విచారణను ఎదుర్కోవడం బాకీ ఉంది. తాజాగా ఆయనకు కూడా లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సిద్ధరామయ్య.. నిందితుడిగా విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఏ2 పార్వతి సిద్ధరామయ్యను, ఏ3 మల్లికార్జునను, ఏ4 దేవరాజ్‌లను ఇప్పటికే లోకాయుక్త విచారించింది. సీఎం కుటుంబానికి కేటాయించిన స్థలాలను కూడా లోకాయుక్త అధికారులు ఇప్పటికే పరిశీలించారు.