Ayodhya Ram Mandir | యావత్ దేశం 500 ఏళ్లుగా కంటున్న కల నెరవేరింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరారు. జయజయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నులపండువగా కొనసాగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగింది.
ప్రధాని మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ అనందీబెన్ పాటిల్, ప్రధాన అర్చకుడు మాత్రమే రామాలయం గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షించిన కోట్లాది మంది ప్రజలు అనీర్వచనీయమైన తన్మయానికి గురయ్యారు. ఆ రాముడి దివ్యరూపం చూసి భక్తపారవశ్యానికి లోనయ్యారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్య రామాలయంపై(Ayodhya Ram Mandir) పూలవర్షం కురిసింది.