సౌదీ యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ తో భారత ప్రధాని మోదీ(PM Modi) కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల అధినేతలు కీలక అంశాలపై చర్చించారు. భారత్-సౌదీ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విశ్లేషణ జరిపారు. ఆర్థికం, వాణిజ్యం, రక్షణ, సాంస్కృతిక సహకారం పై ప్రధానంగా చర్చ జరిగింది. మోదీ 2019లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడే ఈ కౌన్సిల్ సమావేశంపై చర్చలు జరిపారు. ఈరోజు జరిగిన భేటీలో రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తోంది.
అనంతరం మోదీ(PM Modi) మాట్లాడుతూ.. భారత్ కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని వ్యాఖ్యానించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రెండు దేశాలు నూతన అంశాలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో భారత్-సౌదీ ల సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలను అన్వేషించామని మోదీ తెలిపారు.
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్(Mohammed Bin Salman) మాట్లాడుతూ… భారత్ లో పర్యటించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. G 20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు భారత్ ను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా యావత్ ప్రపంచం ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఇరుదేశాల భవిష్యత్తు మెరుగ్గా ఉండేందుకు భారత్ తో కలిసి పని చేసేందుకు సౌదీ అరేబియా ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, సౌదీ యువరాజు భారత్ లో పర్యటించడం ఇది రెండవసారి.
భారత్ కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా కీలక దేశంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ నేథ్యంలోనే భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని 2019లో ప్రకటించారు. 2020 డిసెంబర్లో అప్పటి భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎ నరవణె కూడా సౌదీ అరేబియాలో తొలిసారి పర్యటించారు. అనంతరం ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి.