prisoners tested HIV Positive in Dasna prison at UP: జైలులో శిక్ష అనుభవిస్తున్న 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలటం ఇప్పుడు, దేశ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దస్నా జైలులో వెలుగు చూసింది. జైలు సామర్థ్యం 1704 కాగా, ప్రస్తుతం ఈ జైలులో 5500 మంది శిక్ష అనుభవిస్తున్నారు. వీరందరికీ జైలులో వైద్య పరీక్షలు నిర్వహించిన క్రమంలో.. 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీగా నిర్థారణ కాగా, 17 మంది టీబీతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీల సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ సమయంలో మరో 35 మంది ఖైదీలకు టీబీ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ సందర్భంగా దస్నా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలను నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో హెచ్‌ఐవీ నిర్థారణ అయినట్లు వివరించారు. ప్రభుత్వ సూచనల మేరకు హెచ్‌ఐవీ (HIV positive) బాధిత ఖైదీలను కూడా, సాధారణ ఖైదీలతోనే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలు కావటంతో.. డ్రగ్స్ కోసం వాడే సిరంజీల కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారని అధికారులు చెప్తున్నారు. కానీ హెచ్‌ఐవీ ఇంత ఎక్కువ మందికి సోకటానికి కారణం, అసహజ శృంగారమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. 1704 మంది ఉండాల్సిన జైలులో.. 5500 మంది ఖైదీలను ఏవిధంగా ఉంచారని ప్రశ్నిస్తున్నారు.