Punjab High Court |ఇటీవల దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా రెట్టింపు అవుతోంది. దీంతో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో శునకాల దాడులకు సంబంధించిన కేసులో పంజాబ్-హరియాణా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కుక్కకాటు(Dog Bite)కు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే రూ.20వేల పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వీధుల్లో ఉండే మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్-హరియాణా హైకోర్టు(Punjab High Court) విచారించింది. ఈ సందర్భంగా బాధితులకు పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. కుక్కలు, ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని ఆదేశించింది. బాధితులు క్లెయిమ్ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని సూచించింది.
కాగా గతేడాది నోయిడా అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న సంగతి తెలిసిందే. పెంపుడు శునకాలు, పిల్లులు పౌరులపై దాడులకు పాల్పడితే వాటి యజమానులకు రూ.10వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బాధితుడి చికిత్సకు అయ్యే ఖర్చు కూడా యజమానే భరించాలని ఆదేశించారు.