పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దానికి పూర్తి బాధ్యత మమతా బెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వమే భరించాలని, దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టకూడదంటూ దేశమంతా ఏకైనా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న దీదీ సర్కార్‌కు టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్(MP Jawhar Sircar) భారీ షాక్ ఇచ్చారు. తాను తన ఎంపీ పదవికి, రాజీకాయలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనంతటికీ టీఎంసీ ప్రభుత్వం చేతకాని తనమే కారణమని కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఆయన రాజీనామా మరోసారి టీఎంసీని దేశవ్యాప్తంగా వార్తల్లో నిలబెట్టింది.
‘‘పశ్చిమ బెంగాల్ ప్రజల సమస్యలను ఒక ఎంపీగా రాజ్యసభలో ప్రవేశపెట్టే అద్భుత అవకాశం కల్పించిన టీఎంసీ(TMC)కి నా ధన్యవాదాలు. నేను పార్లమెంటు సభ్యత్వానికి, రాజకీయాలకు రాజీనామా చేస్తున్నానని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమాన్ని ప్రభుత్వం సరిగా నిర్వహించలేక పోయింది. ఆ కారణంగానే నేను రాజకీయాలకు రాజీనామా చేసి న్యాయం కోసం ప్రజలు చేస్తున్న పోరాటంలో వారికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాను. విలువల విషయంలో నా కమిట్‌మెంట్ ఏమాత్రం మారలేదు’’ అని తన(MP Jawhar Sircar) రాజీనామాకు గల కారణాన్ని స్పష్టంగా తేల్చి చెప్పారు.