Parliament | లోక్‌సభలో తీవ్ర భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. విజిటింగ్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు ఆగంతకులు సభలోకి ఒక్కసారిగా ప్రవేశించారు. ఎంపీలు కూర్చునే టేబుళ్ల మీదకి ఎక్కి నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. అంతేకాదు టియర్ గ్యాస్(Tear Gas) ప్రయోగించడం కలకలం రేపుతోంది. దీంతో ఉలిక్కిపడిన ఎంపీలు హుటాహుటిన బయటకు పరుగు తీశారు. మరోవైపు కొంతమంది సభ్యులు ఆగంతకులను చుట్టుముట్టి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఆగంతకులను నీలం(42), అమోల్ షిండే (25)గా గుర్తించారు. దీంతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఉగ్రవాదులు పార్లమెంట్(Parliament) మీద దాడి చేశారు. ఉగ్రదాడిలో అమరులైన వారి కోసం సంస్మరణ సభను పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఇదే రోజు దాడి జరగడం గమనార్హం. దీని వెనక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.