New Criminal Law Bills | భారత శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో తీసుకురాబోయే చట్టాలతో ముడిపడిన మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ, యూపీ మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ సభ్యులు ఈ ప్రజెంటేషన్ ను పూర్తిగా విన్నారు. త్వరలో తీసుకురాబోయే బిల్లులకు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అని హిందీలో పేర్లు పెట్టడంపై ఈసందర్భంగా డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
New Criminal Law Bills | ఈ మూడు బిల్లులపై రాష్ట్రాల బార్ సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించాలని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనకు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మద్దతు తెలిపారు. హోంశాఖ కార్యదర్శి భల్లా శుక్ర, శనివారాల్లోనూ ఈ బిల్లులపై పార్లమెంటరీ కమిటీ ఎదుట ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మూడు నెలల్లోగా కమిటీ ఒక నివేదికను సిద్ధం చేసి రాజ్యసభకు సమర్పిస్తుంది.