Amit Sha – Revanth Reddy | దేశంలో ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మిగిలిన ఐదు విడతల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల అంశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. మరోవైపు డీఫ్ ఫేక్ వీడియోలు కూడా జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి.
ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా(Amit Shah).. మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ చేశారు. మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోందని బీజేపీ IT విభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ ఇప్పటికే ఆరోపించారు. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్‌ను తొలగించడంపైనే అమిత్ షా(Amit Shah) మాట్లాడారని.. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసిన వారిపై చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.