దీపావళి పండగ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీని(Delhi) కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ బాణాసంచాపై పూర్తిస్థాయి నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టి టపాసులు పేల్చారు. పలు ప్రాంతాల్లో దీపావళిని టపాసుల మోతలతోనే జరుపుకున్నారు. ఈ కారణంగానే ఢిల్లీలో శబ్ద కాలుష్యం జరగడమే కాకుండా వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ అంతా కూడా పొగమంచులో మునిగిపోయింది. ఎదురుగా కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 చేరువలో ఉండటం ఆందోళనకరంగా మారింది.
Delhi | ఆనందవిహార్‌లో ఉదయం 6 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 395గా ఉంది. దీంతో అక్కడి గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఆర్కే పురం, బురారీ, మందిర్ మార్గ్, జహంగీర్‌పుర్, ఎయిర్పోర్ట్, అశోక్ విహార్‌లో ఏక్యూఐ 350 వరకు ఉండటం గమనార్హం. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి నుంచి గాలి నాణ్యత పడిపోతూ వస్తోందని అధికారులు చెప్తున్నారు.