Reservation In RCB | కర్ణాటకలో లోకల్ కోటా గోల ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గోల తాకిడి తాజాగా ఐపీఎస్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తాకింది. అన్ని ప్రైవేటు రంగం సంస్థల్లో కన్నడిగులకు 100శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధనను ఆర్‌సీబీ జట్టుకు కూడా అమలు చేయాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇద్దరు ముగ్గురు కన్నడ ఆటగాళ్లను తీసుకుంటున్నప్పటికీ వారిని బెంచ్‌కే పరిమితం చేస్తూ కన్నడిగుల పట్ల ఆర్‌సీబీ వివక్ష చూపుతుందని, ఈ రిజర్వేషన్ చట్టాన్ని అక్కడ కూడా అమలు చేస్తే న్యాయం జరుగుతుందని వారు కోరుతున్నారు. మరికొందరైతే ఈ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతైనా ఆర్‌సీబీ.. ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందేమో అని ఆశాభావం కూడా వ్యక్తపరిచారు. ‘ఐపీఎల్‌కి కూడా ఈ చట్టాన్ని అమలు చేయండి. అప్పుడు ఆర్‌సీబీ జట్టులో కన్నడిగులకు మంచి అవకాశాలు వస్తాయి. అప్పుడైనా ఆర్‌సీబీ.. ఐపీఎల్ టోర్నీని గెలుస్తుందో లేదో చూద్దాం’ అని ఓ వినియోగదారుడు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
Reservation In RCB | ఇదిలా ఉంటే ఆర్‌సీబీ అభిమానుల విన్నపంపై కర్ణాటక ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తాజాగా క్లారిటీ ఇచ్చారు. రానున్న క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై పూర్తిస్థాయిలో చర్చించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని, దీనిపై పూర్తి వివరాలు లేకుండానే మీడియా కథనాలు ప్రచురించేసిందని చెప్పుకొచ్చారాయన. అయితే ఒకవేళ ఈ చట్టం అమలయితే మాత్రం తాము కర్ణాటకు విడిచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.