ఒడిశా(Odisha)లోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన గత దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇంత తీవ్ర విషాదం జరగడానికి సాంకేతికపరమైన సమస్యలా? లేదా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగా ఘోర తప్పిదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నామని.. దీని వెనుక ఇంకేమైనా కారణముందా? అని టీఎంసీ నేత ప్రశ్నించారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ‘కవచ్’ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా ‘కవచ్’ పేరుతో యాంటీ కొలిజన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. డేంజర్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలు నడిపితే ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు ఇది గుర్తించి వెంటనే రైలును ఆపివేస్తుంది. దీంతో రైళ్లు ఢీకొనే ప్రమాదాలను నిలువరించొచ్చు. అయితే ప్రస్తుతం ఈ కవచ్ వ్యవస్థ దేశంలో కొన్ని మార్గాల్లోనే అందుబాటులోకి వచ్చింది.
అయితే ప్రమాదం జరిగిన ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను ఇంకా తీసుకురాలేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. మరోవైపు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే ఘటనా స్థలిని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా(Odisha) సీఎం నవీన్ పట్నాయక్ తదితర ప్రముఖలు సందర్శించారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ కూడా ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.