బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో తుపాన్ గా మారి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
ఉపరితల ద్రోణి దిశను మార్చుకొని బర్మా మీదుగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం ఒడిశాలోని పలుజిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదుకానున్నాయని తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు.
మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావం ఉంటుందన్నారు. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్,జనగాం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఒడిశాపై ఉంటుందన్నారు.