శ్రీ శ్రీ మరణ శాసనం ఇదే : ఆయన రాసుకున్న మరణ శాసనంలో ఏముందో తెలుసా?

0
103

మహా కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ) వర్ధంతి జూన్ 15వ తేదీ. 1983 జూన్ 15న ఆయన మరణించారు. శ్రీ శ్రీ వర్ధంతి కావడంతో ఆయన గురించి ఆసక్తికరమైన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. శ్రీ శ్రీ బతికి ఉన్న రోజుల్లోనే తన మరణ శాసనం తానే రాసుకున్నారు. తన మరణానంతరం తన తనయుడు, తన బంధువులు ఏం చేస్తారు? ఏం చేయాలో సవివరంగా ఆ మరణశాసనంలో పొందుపరిచారు మహా కవి.

శ్రీ శ్రీ రాసుకున్న మరణ శాసనం 25, ఆగస్టు,1975లో ప్రజాతంత్ర వార పత్రికలో ప్రచురితమైంది. ఆ ప్రతి కింద ఉంది. శ్రీ శ్రీ మరణ శాసనంలో పేర్కొన్న అంశాలను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము చదవొచ్చు.

నేను కీర్తి శేషుణ్ణయితే.. !
శ్రీ శ్రీ

ఈ క్షణంలోనో, మరుక్షణంలోనో, మరో శతాబ్దంలోనో నేను మరణించాను. అయితే అలా యెందరు మరణించలేదు. అందులో నేనొకణ్ణి! నేను చచ్చిపోయిన తరవాత నా తరుపున కొన్ని పనులు జరగాలి. అందుకే ఈ మరణ శాసనం! ముందుగా నా శవంతో ప్రారంభిస్తాను. దాని చుట్టూ చేరి చాలామంది ఏడుస్తారు. నా అభ్యంతరం లేదు. ఎంతసేపైనా ఏడవచ్చు. ఏడ్చి ఏడ్చి వాళ్లే మానేస్తారు. తర్వాత నా శవానికి దహన సంస్కారం చేస్తామంటారు అదే వీల్లేదంటున్నాను నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా శవాన్ని అంకితం చేయడానికి నేను సుతరామూ అంగీకరించను. After all, it is my corpse, is not it? or is it?

పత్రికల వాళ్లు యిష్టం వచ్చినట్లు రాస్తారు. నా అభ్యంతరం లేదు. నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానంటాడు. అదే వీల్లేదంటున్నాను నేను. మతం తోనూ, మతం తాలూకు మూఢ విశ్వాసాలతోనూ పోరాడుతూనే మరణించే నన్ను మళ్లీ ఆ ఊబిలోనికెవరు దించదలుచుకున్నా నేనంగీకరించను.

కాబట్టి నేను చనిపోయాక జరగవలసిన మొట్టమొదటి పని నా శవాన్ని విశాఖపట్టణంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి అప్పగించడం. ఇది అక్కడున్న మెడికల్ కాలేజీ విద్యార్థుల్లోని నిరీశ్వర వాదుల ఆధ్వర్యం కింద జరగాలి. తర్వాత నా సంపూర్ణ రచనలను అచ్చు వేసి అన్ని లైబ్రరీలకీ ఉచితంగా పంచిపెట్టాలి.

ఎందుకో గాని దేవుడి మీద కూడా నమ్మకం లేని నాకు నేను చనిపోయేలోగా మన దేశంలో సామ్యవాదం వచ్చేస్తుందనే విశ్వాసం కుదిరింది. సమాజ స్వరూపమైనా మారవచ్చును గాని మనుష్యుల్లోని మతం జిడ్డు ఒక పట్టాన వదలదు. సామ్యవాదుల్లో కూడా దైవభక్తి, దైవభీతి ఉండవచ్చు. ఈ రెండూ సమూలంగా నాశనం కావాలి. భక్తులకీ, పిరికి పందలకీ ఈ ప్రపంచంలో స్థలం ఉండకూడదు.

ఒక కొత్త రకం విశ్వాసం మనిషి మీద, మనిషి మనిషి మీద – అదే కావాలి. జీవితాంతమూ నేనీ విశ్వాసాన్నే ప్రచారం చేస్తాను. నేను కీర్తిశేషుణ్ణయినప్పుడు ఇదే నాకు మిగిలే కీర్తి! నేను చనిపోయినా నన్ను నా ప్రజలు మరిచిపోరు. ఎప్పుడూ వాళ్ల సంస్కృతిలో సజీంగా ఉంటాన్నేను. అదే నా స్మృతి చిహ్నం! ఇదీ నా మరణ శాసనం!