తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం నేడే..వనమంతా జనమే!

0
147

వన దేవతల జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులతో కోలాహలంగా మారిన మేడారం.. నేటి నుంచి జనసంద్రంగా మారనుంది. తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. వన దేవతలు జనం నడుమ మొక్కులందుకోనున్నారు.

ఇప్పటికే భక్తుల జయజయ ధ్వానాలు… మేడారం పరిసరాల్లో మిన్నంటుతున్నాయి. భక్తి పారవశ్యంతో జనం ఉప్పొంగిపోతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులను సల్లంగ సూడుమని వేడుకుంటున్నారు. విద్యుద్దీపకాంతులతో మేడారం పరిసరాలు ధగధగలాడుతున్నాయి. హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మేడారంలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం జాతర ప్రారంభమై.. శనివారం వరకు (16వ తేదీ నుంచి 19 వరకు) అంగరంగ వైభవంగా జరగనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వన దేవతలను దర్శిస్తారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి జాతర ఏర్పాట్లను ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మంగళవారం మేడారం సమీపంలోని కన్నెపల్లె నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు.