హైదరాబాద్ వాసులకు అలెర్ట్. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీస్టేడి యం వైపు వెళ్లే రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
చాపల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతించనున్నారు. గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లించనున్నారు. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడివైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్‌రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దారి మళ్లించి హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు.
కింగ్‌కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్, ఇడెన్ గార్డెన్ మీదుగా అనుమతిస్తారు.
బషీర్‌బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద దారిమళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు. హిమాయత్‌నగర్ వై-జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై-జంక్షన్ వద్ద దారి మళ్లించనున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న వజ్రోత్సవాల గౌరవ వందన కార్యక్రమానికి కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను శామీర్‌పేట్, అల్వాల్, సికింద్రాబాద్, ప్యారడైజ్, ట్యాంక్‌బండ్, లిబర్టీ, బషీర్‌బాగ్ మీదుగా నిజాం కాలేజ్ వరకు అనుమతిస్తారు. వాహనాలను నిజాం కాలేజి గేట్ నంబర్-4, ఎఫ్-గేట్ వద్ద పార్క్ చేయాలి.