వైసీపీ మాతో మైండ్ గేమ్ ఆడుతోంది.. టీడీపీని ఎవ్వరూ వీడటం లేదు!: పంచుమర్తి అనురాధ

వైసీపీ మాతో మైండ్ గేమ్ ఆడుతోంది.. టీడీపీని ఎవ్వరూ వీడటం లేదు!: పంచుమర్తి అనురాధ

0
113

టీడీపీ నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు పార్టీ సామాన్లను బయటపడేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘అది ప్రభుత్వ కట్టడం. దానితో మీకు సంబంధం లేదు’ అని జవాబు ఇస్తున్నారని వాపోయారు. ప్రజావేదిక అక్రమకట్టడం అని సీఎం జగన్ చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు అక్రమ కట్టడంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఒంగోలు పట్టణంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఈరోజు పరామర్శించిన అనంతరం పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు.

టీడీపీని 16 మంది ఎమ్మెల్యేలు వీడుతున్నారని వస్తున్న వార్తలను అనురాధ ఖండించారు. తమ పార్టీని ఎవ్వరూ వీడటం లేదనీ, ఈ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. కరకట్ట ప్రాంతంలో స్వరూపానంద యాగం చేస్తే జగన్, కేసీఆర్ గంటలు, గంటలు కూర్చున్నారనీ, మరి ఆయనకు ఎలా అనుమతి ఇచ్చారని అనురాధ ప్రశ్నించారు. ఒంగోలులో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధితురాలికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.