కృష్ణాజలాల వివాదంపై స్పందించిన సీఎం వైయస్.జగన్. అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి…
నీళ్ల గురించి జరుగుతున్న గొడవలు మీరు చూస్తున్నారు.
ఇప్పటివరకూ ప్రతిపక్షనేత చంద్రబాబు నాలుగైదు రోజులు మౌనంగా ఉన్నాడు, తర్వాత మాట్లాడ్డం మొదలుపెట్టారు.
తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
వారికీ, చంద్రబాబుకూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా.
ఆంధ్రరాష్ట్రం దశాబ్దాలుగా కలిసి ఉంది.
ఆంధ్రరాష్ట్రం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ.
ఈ మూడు కలిసి ఉన్న ప్రాంతాన్నీ ఆంధ్రరాష్ట్రంగా చెప్పుకున్నాం.
రాయలసీమకు ఎన్ని నీళ్లు, కోస్తాంధ్రకు ఎన్ని నీళ్లు, తెలంగాణకు ఎన్నినీళ్లు అనిచెప్పి.. దశాబ్దాలుగా అందరికీ తెలిసిన లెక్కలే.
ఈ లెక్కల ప్రకారం.. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ వచ్చాం.
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వం ముగ్గురూ కలిసి కూడా 2015 జూన్ 19 తారీఖున కేటాయింపుల మీద సంతకాలు కూడా చేశారు.
రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు మొత్తంగా 811 టీఎంసీలు అని చెప్పి ముగ్గురూ సంతకాలు చేశారు.
ఇవాళ ఒక్కటే ఒక్కటి అడుగున్నా.
అయ్యా? ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని ఒక్కసారి గమనించండి.
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందకు రావాలంటే 881 అడుగులు కిందకు చేరితే తప్ప.. ఫుల్‌డిశ్చార్జి నీళ్లు కిందకు రాని పరిస్థితి.
శ్రీశైలం ఫుల్‌కెపాసిటీ 885 అడుగులు.
మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడి దయతో ఈరెండు సంవత్సరాలు మంచి వర్షాలు కురిశాయి.
ఈ రెండేళ్లను పక్కనపెడితే.. 20ఏళ్ల లెక్కలు చూస్తే.. 881 అడుగులు పైచిలుకు కేవలం 20–25 రోజులు కూడా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి ఉంది.
మరోవైపు పక్కరాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి తీసుకున్నా, దిండి తీసుకున్నా, కల్వకుర్తి కెపాసిటీ పెంచి ఇవాళ నీళ్లు వాడుకుంటున్న పరిస్థితులు చూస్తే.. అన్నీకూడా 800 అడుగుల లోపే నీళ్లు తీసుకునే పరిస్థితి తెలంగాణకు ఉంది.
మరోవైపున 796 అడుగులోల్లోనే తెలంగాన రాష్ట్రం కరెంటును జనరేట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
ఇలాంటప్పుడు మీరేమో 800 అడుగులలోపులోనే మీకు కేటాయించిన నీటిని వాడుకోవడం మీకు తప్పులేనప్పుడు మరి మేం 881 అడుగులు పోతే తప్ప నీళ్లువాడుకోలేని పరిస్థితి మాకు కనిపిస్తున్నప్పుడు, అదే 800 అడుగుల్లో మేం కూడా రాయలసీమ లిఫ్టు పెట్టి మేం కూడా మాకు కేటాయించిన నీటిని మా హక్కుగా మాకిచ్చిన నీటిని వాడుకుంటే తప్పేముంది.
చంద్రబాబుగారికి ఇంకా ఘాటుగా కూడా చెప్పదలుచుకున్నా.
అయ్యా చంద్రబాబు ఇవాళ మాటలు మాట్లాడుతున్నావు.
అయ్యా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన పాలమూరు రంగారెడ్డి, దిండి.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? చంద్రబాబూ.
ఈ పెద్దమనిషి అప్పుడు గాడిదుల కాసి.. ఇవాళ మనంకూడా 800 అడుగుల్లోనే లిఫ్టును పెట్టి మనకు కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
ఎవరి నీటినీ తీసుకోవడానికి కాదు.
రైతు ఎక్కడున్నా రైతే.
నీళ్లు ఎవరికైనా ప్రియమే.
వాళ్లుకూడా బతకాలి.. మనంకూడా బతకాలి.
తాగడానికీ, రైతున్నకు నీళ్లు ఇవ్వడానికీ అందరం కూడా ఒక్కటి కావాలి.
అలాంటి నీటి విషయంలో రాజకీయాలు జరుగుతుంటే.. చూడలేక ఈ విషయాలు మాట్లాడుతున్నా.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకాని, జగన్‌కాని కోరుకుంటున్నది ఒక్కటే.
ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు.
ఏ ఒక్క పక్కరాష్ట్రంతోనైనా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం.
అక్కడ కూడా ప్రజలు చల్లగా బాగుండాలి.
ఇక్కడ కూడా ప్రజలు చల్లగా ఉండాలి.
అలా ఉండాలంటే పాలకులమధ్య సఖ్యత ఉండాలి.
అలా ఉంటేనే ఇది జరుగుతుంది.
కాబట్టి… ఆసఖ్యతే కావాలి.. ఉండాలి.
దీన్ని మనసారా జగన్ కోరుకుంటున్నారు.
అందుకనే తెలంగాణ రాజకీయాల్లో జగన్ వేలు పెట్టలేదు, కర్ణాటక రాజకీయాల్లో కూడా జగన్ వేలుపెట్టలేదు, తమిళనాడు రాజకీయాల్లోకూడా జగన్ వేలు పెట్టలేదు.
రాబోయే రోజుల్లోకూడా జగన్ వేలు పెట్టడు.
రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి.
సఖ్యతతో సమస్యలను ఎదుర్కోవాలి.
దేవుడి దయతో ఈసారి వర్షాలు బాగా పడాలి.
రైతన్నలకు మంచి చేసే అవకాశం ఇవ్వాలి.